పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ మంగళవారం దేవరకొండ పట్టణంలోని 9, 10వార్డుల్లో పర్యటించి సమస్యలను దగ్గరుండి పరిశీలించారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులకు చెప్పి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల పర్యటన అనంతరం స్థానిక సాయిరమ్య ఫంక్షన్ హాల్లో మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. ఇంకా నాలుగేండ్లపాటు ఏ ఎన్నికలు లేవని, ఇక ప్రజా ప్రతినిధులంతా ప్రజల బాగోగుల కోసం పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి ఇంటి సమీపంలో ఓ ప్లాటు వద్ద అపరిశుభ్ర వాతావరణాన్ని గమనించిన మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీన్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు పారిశుధ్య ప్రణాళికను రూపొందించుకుని దేవరకొండ పట్టణాన్ని ఆరు నెలల్లో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం పట్టణంలోని ఎనిమిది వేల ఇండ్లకు రెండేసి చెత్త బుట్టలను నాలుగైదు రోజుల్లోనే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పొడి చెత్తతో స్థానిక మెప్మా సిబ్బంది లక్ష రూపాయల మేర ఆదాయం సమకూర్చుకునే సౌలభ్యం ఉందని, ఇప్పటికే సిరిసిల్లలో అమలవుతున్న ఈ విధానాన్ని చూసి అవగాహన పెంచుకోవాలన్నారు.
మనం మారుదాం..మన పట్టణాన్ని మార్చుకుందాం...