గ్రామాల వారీగా ప్రత్యేక బడ్జెట్ రూపొందించుకోవాలి: మంత్రి సబితా

మరో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజా ప్రతినిదులు, అధికారులు సన్నద్ధం  కావాలని అదేవిధంగా  గ్రామాలవారీగా ప్రత్యేక బడ్జెట్ రూపొందించుకోవాలని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పంచాయ‌తీ స‌మ్మేళనంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ, విధులపై స్థానిక ప్రజాప్రతినిధులకు  మంత్రి  వివరించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా,  స్వచ్ఛ, ప‌చ్చ‌ని  గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు  ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం రూపొందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు, విధులు కేటాయించిందని తెలిపారు.  గ్రామాలను  ఆదర్శంగా తిర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా కలసికట్టుగా ప‌ని చేయాల‌ని  సూచించారు. నిరక్షరాస్యులందరిని అక్షరాస్యులుగా చేసే భాద్యత చేపట్టాలన్నారు. గ్రామాల వారీగా బడ్జెట్ ను రూపొందించుకోవాలన్నారు.