పారదర్శక పురపాలన

మున్సిపల్‌ ఎన్నికల్లో అనితర సాధ్యమైన, కలలో కూడా ఉహించనంత విజయాన్ని అందించిన పట్టణ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో సేవచేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు నిస్సిగ్గుగా ఒక్కటై కొన్ని చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ పదవులను పంచుకున్నాయని.. మున్సిపాలిటీ పదవులకోసం రెండు జాతీయపార్టీలు దిగజారాయని విమర్శించారు. ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన వారి అనైతిక ఒప్పందాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్‌లో మంత్రి తలసానిశ్రీనివాస్‌ యాదవ్‌, పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్‌తో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంతటి విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞులమై ఉంటామన్నారు. మున్సిపల్‌ ఎన్నికలసందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసే బాధ్యతను మున్సిపల్‌ మంత్రిగా తాను తీసుకుంటానని ప్రకటించారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నదని.. ఇప్పటికే 43శాతం జనాభా ఉన్న పట్టణాలను ప్రణాళికాబద్ధంగా విస్తరించాలనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలోనే ఆదర్శపట్టణాలుగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్తగా పట్టణ పాలకవర్గాలకు శిక్షణఇస్తామని.. వారికి బాధ్యతలు, నిధులు, విధుల గురించి వివరిస్తామని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినవిధంగా అర్బన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. త్వరలోనే పట్టణ ప్రగతిని నిర్వహిస్తామన్నారు. పారదర్శకమైన అనుమతుల విధా నం, అవినీతికి ఆస్కారంలేని పాలన అందిస్తామని చెప్పారు. మున్సిపాటీలు, ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కామన్‌ మున్సిపల్‌ సర్వీసెస్‌ను అమలుచేస్తామన్నారు.